Pawan Kalyan: కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games)2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై చాటారు. 39 పతకాలతో భారత్ విజయవంతమైన ప్రయాణాన్ని ముగించగా, ఈ ఘనతపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ప్రతి పతకం వెనుక క్రీడాకారుల సంవత్సరాల కఠోర శ్రమ, త్యాగం, క్రమశిక్షణ, పట్టుదల దాగి ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పతకాలు సాధించిన ఆటగాళ్లతో పాటు వారికి మార్గనిర్దేశం చేసిన కోచ్‌లు, అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది కృషిని కూడా ఆయన కొనియాడారు. కామన్వెల్త్ పోటీల ప్రారంభం నుంచి చివరి దశ వరకు టీమ్ ఇండియా అసాధారణ పోరాట పటిమ, క్రీడాస్ఫూర్తి, ప్రతిభను ప్రదర్శించిందని అన్నారు. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రతి క్రీడాకారుడు 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచారని తెలిపారు.
భారత క్రీడారంగం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని, క్రీడాకారుల విజయాలు యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కఠోర శ్రమ, అంకితభావంతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని వారి విజయాలు నిరూపించాయని అన్నారు. ఈ విజయ యాత్రలో భాగమైన ప్రతి పతక విజేత, ఆటగాడు, కోచ్, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత క్రీడారంగంలో మరెన్నో అద్భుత విజయాలకు ఈ ఘనత పునాది కావాలని ఆకాంక్షించారు.








