Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పార్థివదేహం నర్సంపేటకు చేరుకోగా, తమ అభిమాన నాయకుడి చివరి చూపు కోసం ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు. పలువురు ఆయన భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డి గత ఐదు రోజులుగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి అనంతరం తుదిశ్వాస విడిచారు.
జూలై 26న హనుమకొండలోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో తొలుత స్థానిక ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శ్రమించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహిత సహచరుడిగా పేరొందిన సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కీలకంగా పనిచేశారు. 1974 ఆగస్టు 6న నల్లబెల్లి గ్రామంలో జన్మించిన ఆయన, 2001లో టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కన్వీనర్, జిల్లా అధ్యక్షుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
ఆయన మరణంతో తెలంగాణ ఉద్యమానికి సేవలందించిన ఓ కీలక నాయకుడిని కోల్పోయామని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.








