Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 1న రాష్ట్రంలో పర్యటించి రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారికంగా వెల్లడించింది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మౌలిక సదుపాయంగా మారనుంది.
అదే కార్యక్రమంలో విశాఖపట్నంలో రూ.460 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్తొ తోలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సంవత్సరానికి 9.6 కోట్ల సెమీకండక్టర్ చిప్‌ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు కొత్త దిశ చూపనుంది. పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసే దిశగా రూ.5,550 కోట్లతో నిర్మించనున్న కర్నూలు-IV రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సోలార్-విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన రూ.3,550 కోట్ల, రూ.820 కోట్ల విద్యుత్ ప్రసార ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
ఇక రూ.1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. వీటి ద్వారా విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం తగ్గి, రాష్ట్రంలో రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. భోగాపురం కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ కర్ణాటకలోని మైసూరుకు వెళ్లి స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ALSO READ: Srinivasa Mangapuram OTT | జయకృష్ణ తొలి సినిమాకు ఓటీటీ క్రేజ్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?








