Mulugu floods: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సమ్మక్క-సారక్క బ్యారేజ్ గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేయడంతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని రేగమాగ వాగుపై ఉన్న లోలెవెల్ వంతెన నీటమునిగింది. వంతెనపై వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తున్న వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి.
ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నీటి మట్టం తగ్గే వరకు వంతెనపై ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.








