Peddi Sudarshan Reddy: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణంలో ఎంతో కాలం పాటు కలిసి నడిచిన ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడేందుకు పార్టీ అన్ని విధాలా ప్రయత్నించిందని, వైద్యులు కూడా శక్తివంచన లేకుండా చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ క్లిష్ట సమయంలో పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని తన శ్వాసగా భావిస్తూ, నైతిక విలువలు, నిజాయితీతో ప్రజా జీవితం సాగించిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని కేసీఆర్ కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో బీఆర్ఎస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఉద్యమ స్ఫూర్తిని బలోపేతం చేసిన ధైర్యవంతుడని అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది నిలిచిపోతారని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కేసీఆర్ తన సంతాప సందేశంలో తెలిపారు.
ALSO READ: Telangana floods | గోదావరి ఉగ్రరూపం.. ప్రాజెక్టులన్నీ వరద నీటితో కళకళ!








