Satya Nadella: కృత్రిమ మేధస్సు(AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏఐ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన ప్రజల్లో పెరుగుతోందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఏఐపై నమ్మకం తగ్గడానికి ప్రధాన కారణం సాంకేతికతపై వ్యతిరేకత కాదని, ఉద్యోగ భద్రతపై ఉన్న భయమేనని ఆయన స్పష్టం చేశారు. ఏఐను చూసే విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నాదెళ్ల పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది ఈ టెక్నాలజీని అవకాశంగా కాకుండా ముప్పుగా చూస్తున్నారని, అందుకే విశ్వాసం తగ్గుతోందని చెప్పారు.
విద్యాసంస్థల్లో ఏఐపై చర్చలు జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు ప్రతికూల స్పందనలు రావడం దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత టెక్ సంస్థలపై ఉందని నాదెళ్ల తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు, పన్నుల ఆదాయం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి ప్రయోజనాలు ఎలా అందుతాయో వివరించాల్సి ఉందన్నారు. ఏఐ లక్ష్యం మనుషుల ఉద్యోగాలను తొలగించడం కాదని, కొత్త అవకాశాలను సృష్టించే సాధనంగా ఉపయోగపడాలని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో అవసరమయ్యే కొత్త ఉద్యోగాలను గుర్తించడం, వాటికి తగిన నైపుణ్యాలు, వేతనాల రూపకల్పనలో కూడా ఏఐ కీలక పాత్ర పోషించగలదని సత్య నాదెళ్ల తెలిపారు.
ALSO READ: Vangalapudi Anitha | హోంమంత్రి అనిత ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్.. రంగంలోకి సైబర్ టీమ్








