TG TET 2026: తెలంగాణలో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-In-service Teachers-2026) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు TG TET పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుల్లో కొనసాగేందుకు, అలాగే భవిష్యత్ పదోన్నతులు పొందేందుకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో పాఠశాల విద్యాశాఖ ఈ ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తోంది.
జూలై 22 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు 31న హాల్‌టికెట్లు విడుదల చేయగా, సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. సెప్టెంబర్ 28 నుంచి 30 మధ్య ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1 నుంచి 5 తరగతులకు బోధించే ఎస్‌జీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలకు పేపర్-1, 6 నుంచి 8 తరగతుల బోధకులైన స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండితులు, టీజీటీలు, హైస్కూల్ హెచ్‌ఎంలకు పేపర్-2 నిర్వహిస్తారు. రెండు స్థాయిలకు అర్హత ఉన్న ఉపాధ్యాయులు రెండు పేపర్లు రాయవచ్చు.
ఫీజుగా జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950 చెల్లించాలి. అర్హత మార్కులు జనరల్/ఈడబ్ల్యూఎస్‌కు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు. ఈ టెట్ అర్హత కేవలం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కొనసాగింపు, ప్రమోషన్లకు మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్ ప్రత్యక్ష నియామకాలకు ఇది చెల్లుబాటు కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ALSO READ: NBK111 షూటింగ్లో గాయపడ్డ నటసింహం.. అభిమానులకు కీలక సమాచారం








