Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు రుక్మిణి మల్లిక్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆమె రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖను పంపించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు, వెంటనే అమల్లోకి వచ్చేలా ఆమోదించాలని లేఖలో కోరారు. రాజీనామా లేఖలో తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ రుక్మిణి మల్లిక్ ధన్యవాదాలు తెలిపారు. తన పదవీకాలంలో సహకరించిన రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు, సిబ్బందికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అందించిన సహకారం, మద్దతును ఆమె గుర్తు చేసుకున్నారు.
అయితే రుక్మిణి మల్లిక్ ఆకస్మిక రాజీనామా వెనుక ఉన్న అసలు రాజకీయ కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ పరిణామంపై టీఎంసీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు లోక్‌సభ సభ్యులు పార్టీపై అసంతృప్తితో రెబల్ వర్గంగా ఏర్పడినట్లు సమాచారం. ఆ ఎంపీలు తమ వర్గాన్ని ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI)లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రుక్మిణి మల్లిక్ రాజీనామా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.








