Srisailam: సంప్రదాయ చేనేత కళకు మరోసారి అరుదైన గుర్తింపు లభించింది. తెలంగాణలోని సిరిసిల్ల(Sircilla)కు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తన అద్భుత నైపుణ్యాన్ని చాటుతూ శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి ప్రత్యేకంగా రూపొందించిన పట్టుచీరను సమర్పించారు. ఈ చీర ప్రత్యేకత ఏమిటంటే.. పూర్తి పరిమాణంలో ఉన్నప్పటికీ మడతపెడితే చిన్న అగ్గిపెట్టెలో సైతం సులభంగా ఇమిడిపోతుంది.
ఈ అరుదైన పట్టుచీరను శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడికి విజయ్ కుమార్ అందజేశారు. అనంతరం దేవస్థానం తరఫున అధికారికంగా ఈ వస్త్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు వారం రోజుల పాటు శ్రమించి ఈ ప్రత్యేక చీరను మగ్గంపై నేసినట్లు తెలిపారు.
సుమారు 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు కలిగిన ఈ పట్టుచీర బరువు కేవలం 200 గ్రాముల వరకు మాత్రమే ఉంటుందని వివరించారు. సంప్రదాయ ఇక్కత్ నేసే విధానాన్ని ఉపయోగించి రూపొందించిన ఈ వస్త్రం చేనేత కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతోనే ఈ వినూత్న సృష్టి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
చేనేత కళాకారుడి ప్రతిభను అభినందించిన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, ఇలాంటి కళాఖండాలు తెలుగు రాష్ట్రాల చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయని అన్నారు. సంప్రదాయ నైపుణ్యాన్ని సజీవంగా నిలబెడుతున్న కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం విజయ్ కుమార్‌తో పాటు ఆయన బృందానికి దేవస్థానం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి సత్కరించింది.








