Ukraine Prime Minister: ఉక్రెయిన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి యులియా స్విరిడెన్‌కో(Yulia Svyrydenko) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దేశంలో ప్రభుత్వ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ చేపడుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజీనామా అనంతరం సామాజిక మాధ్యమాల్లో స్పందించిన స్విరిడెన్‌కో, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం తన రాజకీయ జీవితంలో అత్యంత గౌరవప్రదమైన ఘట్టమని పేర్కొన్నారు. యుద్ధ పరిస్థితులు, ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగస్వామ్యం కావడం గర్వంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. తన భవిష్యత్ బాధ్యతలపై అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఇప్పటికే చర్చలు జరిగాయని స్విరిడెన్‌కో వెల్లడించారు. అయితే ఆ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.
దీంతో ఆమెకు ప్రభుత్వంలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మరోవైపు, స్విరిడెన్‌కో రాజీనామాను అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా అధికారికంగా ధ్రువీకరించారు. దేశ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వంలో కీలక మార్పులు చేపడుతున్నామని, పరిపాలనను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ ప్రభుత్వంలో త్వరలోనే మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








