ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram International Airport) ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులతో సమావేశమై మిగిలిన పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారని తెలిపారు. ఆ దిశగా జీఎంఆర్ సంస్థ నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పనులను పూర్తి చేసిందని చెప్పారు. విమానాశ్రయానికి అవసరమైన ఎయిరోడ్రోమ్ లైసెన్స్ ఇప్పటికే లభించిందని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ అందుబాటులో ఉండే తేదీని ఖరారు చేసిన వెంటనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 78 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన టెర్మినల్ భవనం ఆధునిక సదుపాయాలతో రూపొందించబడిందని, ప్రతి ఏడాది కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం దీనికి ఉందని వివరించారు.
విమానాశ్రయ రూపకల్పనలో ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, కళా వైభవానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి విభాగాన్ని రూపొందించామని చెప్పారు. విమానాశ్రయం ప్రారంభమైన వారం రోజుల్లోనే ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నిర్వహిస్తున్న పౌర విమాన సర్వీసులను భోగాపురానికి తరలించే ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు.
భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం ద్వారా ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








