Eknath Shinde: అస్వస్థత కారణంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరం, తీవ్రమైన నీరసం, ఒళ్లునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన వైద్యుల సూచన మేరకు చికిత్స పొందుతున్నారు.
కుటుంబ సభ్యులు షిండేను థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో చేర్పించగా, అక్కడ నిపుణులైన వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు అవసరమైన వైద్య సేవలను అందిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇటీవలి రోజులుగా రాజకీయ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, వరుస పర్యటనలు వంటి బిజీ షెడ్యూల్ కారణంగా షిండే తగినంత విశ్రాంతి తీసుకోలేదని తెలుస్తోంది. అదే ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్త బయటకు రావడంతో పలువురు రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు షిండే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనల మేరకు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.








