Dinosaur Fossil: నాలుగు దశాబ్దాలుగా ఓ మ్యూజియం డ్రాయర్‌లో భద్రపరిచిన చిన్న శిలాజం ఇప్పుడు శాస్త్ర ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నో ఏళ్లుగా సాధారణ ఎముక ముక్కగా భావించిన ఆ శిలాజం, వాస్తవానికి అంటార్కిటికాలో ఇప్పటివరకు గుర్తించిన తొలి డైనోసార్ అవశేషమని తాజా పరిశోధనలు వెల్లడించాయి. దీంతో భూమి దక్షిణ ధ్రువ ప్రాంతం కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉండేదన్న అంశంపై కొత్త అధ్యయనాలకు మార్గం సుగమమైంది.
1985లో అంటార్కిటికాలోని జేమ్స్ రాస్ ద్వీపంలో నిర్వహించిన శాస్త్రీయ యాత్ర సందర్భంగా ఈ శిలాజాన్ని సేకరించారు. అప్పట్లో అది ఏ జీవికి చెందినదో నిర్ధారించలేక బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే భూగర్భ శాస్త్ర విభాగంలో భద్రపరిచారు. ఇటీవల పాత శిలాజాలను మరోసారి పరిశీలిస్తున్న సమయంలో ఈ నమూనాపై శాస్త్రవేత్తల దృష్టి పడింది.
బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన డాక్టర్ మార్క్ ఎవాన్స్ దీనిని పరిశీలించిన అనంతరం, ఇది సాధారణ సరీసృపం ఎముక కాదని అనుమానించారు. అనంతరం నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని నిపుణుల సహకారంతో విశ్లేషించగా, ఇది టైటానోసార్ జాతికి చెందిన తోక వెన్నెముకగా నిర్ధారణ అయింది. ప్రత్యేక ఆకృతి, ఎముక నిర్మాణం ఆధారంగా ఈ గుర్తింపును ఖరారు చేశారు.
టైటానోసార్‌లు భూమిపై సంచరించిన అతిపెద్ద శాకాహార డైనోసార్‌లలో ఒకటిగా గుర్తింపు పొందాయి. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా జాతులు గుర్తించినప్పటికీ, అంటార్కిటికాలో లభించిన ఈ శిలాజం అక్కడి జీవ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంలో కీలక ఆధారంగా నిలుస్తోంది. ఈ డైనోసార్ సుమారు 8.2 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మంచుతో కప్పబడి కనిపించే అంటార్కిటికా ఒకప్పుడు దట్టమైన అడవులు, సమృద్ధిగా వృక్ష సంపద కలిగిన ప్రాంతంగా ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తాజా గుర్తింపు ఆ ప్రాంతంలోని ప్రాచీన జీవావరణంపై మరిన్ని పరిశోధనలకు కొత్త అవకాశాలను తెరిచిందని వారు అభిప్రాయపడుతున్నారు.
Dinosaur Fossil | 40 ఏళ్ల తర్వాత బయటపడిన రహస్యం.. అంటార్కిటికాలో తొలి డైనోసార్ శిలాజం గుర్తింపు
-








