EVM controversy: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న రెండో దశ పోలింగ్ సమయంలో రాజకీయ వివాదం చోటుచేసుకుంది. డైమండ్ హార్బర్ పరిధిలోని ఫల్తా నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రంలో ‘కమలం గుర్తు’ కనిపించకుండా చేశారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ఆరోపణలు చేసింది.
కమలం గుర్తు ఉన్న బటన్‌ను టేప్‌తో కప్పి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఓటర్లు తమ హక్కును వినియోగించకుండా అడ్డుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు స్థానిక అధికారులతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ ఘటనలు జరిగిన అన్ని కేంద్రాల్లో వెంటనే మళ్లీ పోలింగ్ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
గత ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయని, డైమండ్ హార్బర్‌లో అభిషేక్ బెనర్జీ గెలుపు కోసం ఇలాంటి పద్ధతులు అనుసరించారనే వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బటన్లకు సంబంధించి మార్పులు జరిగాయన్న సమాచారం తమ దృష్టికి వచ్చిందని ఈసీ తెలిపింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది.
ఆరోపణలు నిజమని తేలితే ప్రభావిత కేంద్రాల్లో మళ్లీ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు కూడా తెలిపింది.








