Ambedkar Jayanti: భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, అంటరానితనం, కుల వివక్షను ఎదుర్కొని ఉన్నత విద్యను సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా నిలవడానికి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే ప్రధాన కారణమని ఆయన అన్నారు.
ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన మహానేతగా అంబేద్కర్ నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయడం ద్వారా మాత్రమే నిజమైన నివాళి అర్పించగలమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక మంత్రి నారా లోకేష్ కూడా అంబేద్కర్‌కు నివాళులు అర్పిస్తూ, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడిగా ఆయనను కొనియాడారు.
సమాజంలో అసమానతలు, అంటరానితనం నిర్మూలన కోసం అంబేద్కర్ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనదేనని లోకేష్ పేర్కొన్నారు.








