Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క్యూబాపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు మరియు విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని ఆయన అన్నారు. ముందుగా ఇరాన్ పై జరుగుతున్న చర్యలను పూర్తి చేసిన తర్వాత క్యూబా విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
అయితే అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా చెప్పలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ దళాలతో కలిసి తమ సైన్యం ఇరాన్‌పై ఊహించిన దానికంటే వేగంగా ఆపరేషన్లు కొనసాగిస్తున్నదని ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్‌పై వరుస దాడుల కారణంగా ఆ దేశ సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నదని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఇరాన్‌కు అమెరికా తరహాలో శక్తివంతమైన వైమానిక దళం లేకపోవడం వల్ల దాడులను సమర్థంగా ఎదుర్కోలేకపోతుందని వ్యాఖ్యానించారు.
అలాగే ఇరాన్ నౌకాదళంపై కూడా తీవ్ర దాడులు జరిగాయని ట్రంప్ తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే 24 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ అధికారులు చర్చలకు సిద్ధమయ్యారని ట్రంప్ అన్నారు.
అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి ఆసక్తి చూపుతున్నట్లు కొందరు ఇరాన్ దౌత్యవేత్తలు తమను సంప్రదించారని తెలిపారు. అయితే ఇప్పటికి అది చాలా ఆలస్యమైందని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. టెహ్రాన్ రాజకీయ భవిష్యత్తు పునర్నిర్మాణంలో ఇరాన్ ప్రతినిధులు సహకరించాలని సూచించారు.
మరోవైపు క్యూబా కూడా అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని ఎదురుచూస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఆపరేషన్లు పూర్తైన తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.









