White House incident: వాషింగ్టన్‌లో వైట్‌హౌస్‌కు అత్యంత సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన అమెరికా రాజధనిని కుదిపేసింది. గస్తీ కాస్తున్న సమయంలో ఓ దుండగుడు అకస్మాత్తుగా వారిపై కాల్పులు జరపగా, ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ దాడిని ‘హీనమైన చర్య‘ ‘ఉగ్రదాడి’గా పేర్కొన్నారు.
భద్రతను మరింత బలోపేతం చేసేందుకు వాషింగ్టన్‌కు అదనంగా 500 మంది సైన్యాన్ని పంపాలని పెంటగాన్‌ను ట్రంప్ ఆదేశించారు.
ALSO READ:బాపట్లలో అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ – తృటిలో తప్పిన ప్రమాదం
వైట్‌హౌస్‌కు కొన్ని బ్లాకుల దూరంలో బుధవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. కాల్పులు జరిగిన తరువాత వెంటనే వైట్‌హౌస్ ప్రాంతాన్ని భద్రత దళాలు లాక్‌డౌన్ చేశాయి. ఎదురుకాల్పుల్లో గాయపడిన నిందితుడిని అదుపులోకి తీసుకుని 29 ఏళ్ల రెహమానుల్లా లకన్‌వాల్‌గా గుర్తించారు.
ఇతడు 2021లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అమెరికాకు చేరిన ఆఫ్ఘన్ జాతీయుడని అధికారులు చెప్పారు. అమెరికా సైన్యానికి సహాయం చేసిన అఫ్ఘన్లకు ఇచ్చే ప్రత్యేక వీసాపై వచ్చి, గడువు ముగిసినా దేశంలోనే అక్రమంగా ఉన్నట్లు విచారణలో తెలిసింది.
ఈ ఘటనపై ట్రంప్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బైడెన్ ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను దేశంలోకి అనుమతించిందని విమర్శించారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని, ఉగ్రదాడి కోణంలో కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
