తుర్కియేకి(Turkiye military plane crash) చెందిన సైనిక కార్గో విమానం తూర్పు జార్జియాలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమాన సిబ్బంది సహా 20 మంది మరణించినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అజర్‌బైజాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, “అజర్‌బైజాన్ నుంచి బయలుదేరిన మా సీ–130 సైనిక కార్గో విమానం జార్జియా–అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలో కూలిపోయింది.
ఈ ప్రమాదకర విమాన ప్రయాణంలో సిబ్బందితో సహా మొత్తం 20 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ప్రమాదానికి ముందు విమానం గాల్లోనే గింగిరాలు కొడుతూ వేగంగా నేల వైపు దూసుకెళ్లి, ఢీకొట్టగానే భారీ మంటల్లో చిక్కుకున్నట్లు వీడియో ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. విమాన శకలాలు తగలబడుతూ, దట్టమైన పొగలు కమ్ముకున్న దృశ్యాలు అజర్‌బైజాన్ మీడియా ప్రసారం చేసింది.
ఈ ఘటనపై తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారిని అమరవీరులుగా అభివర్ణించారు.
also read:Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేదెవరు..?
ప్రమాద స్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయని, జార్జియా అధికారులతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ కూడా ఎర్డోగాన్‌కు సంతాపం తెలిపారు.
జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, అజర్‌బైజాన్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలోని సిగ్నాఘి ప్రాంతంలో విమానం కూలిపోయింది.
జార్జియా గగనతలంలోకి ప్రవేశించిన కొద్ది సేపటికే రాడార్ నుంచి అదృశ్యమైందని, ఎలాంటి ప్రమాద సంకేతాలు పంపలేదని పేర్కొంది. ఈ సీ–130 హెర్క్యులస్ విమానం అమెరికన్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తయారీదని అధికారులు తెలిపారు.
