సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉత్సాహంగా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాదులోని పీవీ మార్గ్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్మంతుడై రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించాలని ఆకాంక్షించారు.
రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకు సాగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సైకత కళాకారుడు ఆకునూరు బాలాజీ వరప్రసాద్ హుస్సేన్ సాగర్ తీరాన సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
వరప్రసాద్ కైకలూరు మండలం పల్లెవాడ గ్రామానికి చెందినవాడు. 2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లో 28 దేశాల మధ్య తొలి స్థానంలో నిలిచి గుర్తింపు పొందాడు. అలాగే ఒడిశాలోని కోణార్క్ కళోత్సవంలోనూ ప్రథమ బహుమతి సాధించాడు.
అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో OU JAC ఆధ్వర్యంలో కూడా జన్మదిన వేడుకలు జరిగాయి.
గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రతి గడపకు సంక్షేమం చేర్చిన సీఎం రేవంత్‌కు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.
