IND vs AUS 5వ టీ20: సిరీస్‌ కైవసం దిశగా భారత్, ఒత్తిడిలో ఆస్ట్రేలియా

IND vs AUS 5వ టీ20 మ్యాచ్‌ గాబాలో రసవత్తర పోరు

ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి పోరు ఈరోజు గాబాలో జరగనుంది. ఇప్పటికే 3–1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ తమదే అవుతుంది.

మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా మాత్రం సిరీస్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్వదేశంలో ఓటమి తప్పించుకోవాలనే ఒత్తిడిలో కంగారూలు కనిపిస్తున్నారు. బౌన్స్‌ ఉన్న గాబా పిచ్‌లో ఆసక్తికర పోరు జరగడం ఖాయం.

భారత బ్యాటింగ్‌ వైపు చూస్తే శుభ్‌మన్ గిల్‌ ఫామ్‌పై ఇంకా ప్రశ్నార్థక చిహ్నమే ఉంది. గత 7 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతని వెంట అభిషేక్‌ శర్మ దూకుడుతో ఆడుతున్నా, సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది.

గత 18 ఇన్నింగ్స్‌ల్లో సూర్య ఒక్కసారి కూడా అర్థశతకం చేయలేదు. తిలక్‌ వర్మ ఫామ్‌లోకి వస్తే టీమిండియాకు మరింత బలం చేకూరుతుంది. గత మ్యాచ్‌లో బౌలర్లు చక్కగా రాణించినా, బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుదల అవసరం ఉంది.

ALSO READ:కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదం – పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి దుర్మరణం

అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబేలు రెండు విభాగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ప్రత్యర్థులకు తలనొప్పిగా మారాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయికి జస్ప్రీత్‌ బుమ్రా ఒకే వికెట్‌ దూరంలో ఉన్నాడు.

భారత్‌ విజేత జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా వైపు చూస్తే హెడ్స్‌, హేజల్‌వుడ్‌ల గైర్హాజరీతో జట్టు అసమతుల్యంగా మారింది.

మిచెల్‌ మార్ష్ మాత్రమే క్రమంగా రాణిస్తున్నాడు. షార్ట్‌, ఇన్‌గ్లిస్‌, టిమ్‌ డేవిడ్‌లు ఫామ్‌లోకి వస్తే భారీ స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. బౌలింగ్‌లో ఆడమ్‌ జంపా రన్స్‌ ఇస్తుండటంతో కంగారూల బౌలింగ్‌ బలహీనంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *