ఎమ్మిగనూరు పట్టణంలోని పార్కుల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మాచాని సోమప్ప (పెద్ద పార్క్)ను పరిశీలించి, అందులోని సౌకర్యాల పరిస్థితులను గమనించారు.
పట్టణంలోని ప్రధాన రహదారుల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు సోమప్ప సర్కిల్ వద్ద రహదారులను పరిశీలించారు. పార్క్ అభివృద్ధికి కావాల్సిన సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డితో కలిసి పర్యవేక్షణ నిర్వహించారు. పార్కును ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్కులను ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంగా మారుస్తామని తెలిపారు. ప్రజలకు విశ్రాంతి కల్పించే విధంగా పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు.
ఇంకా రెండు కొత్త పార్కుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్కుల్లో తాగునీటి సౌకర్యం, పిల్లలకు ఆటస్థలాలు, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.