లండన్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పైలట్ అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
ల్యాండింగ్ అనంతరం సెక్యూరిటీ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకుని, ప్రయాణికులను సురక్షితంగా విమానం నుండి దింపించారు.
తరువాత బాంబ్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్ బృందాలు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి. ప్రతి సీటు, లగేజ్ సెక్షన్, కార్గో ఏరియా సహా అన్ని ప్రాంతాల్లో విపులంగా పరిశీలన జరిపిన అధికారులు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తేల్చారు.
ఈ నిర్ధారణతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బాంబు బెదిరింపు మెయిల్ ఎవరు పంపారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మెయిల్ లండన్ నుంచి పంపించబడిందా లేదా దేశీయంగా పంపబడిందా అనే అంశంపై సైబర్ క్రైమ్ శాఖతో కలిసి పరిశోధన సాగుతోంది.
విమాన సంస్థ ప్రతినిధులు కూడా ఈ ఘటనపై అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నారు.
ALSO READ:KCR: జయ జయ హే తెలంగాణ కవి అందెశ్రీ మరణం పట్ల దిగ్భ్రాంతి
