న్యూఢిల్లీ/తేహ్రాన్: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత నౌకలకు ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మధ్య జరిగిన కీలక చర్చల ఫలితంగా, భారత నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI)కి చెందిన ‘శివాలిక్’ మరియు ‘నందా దేవి’ అనే రెండు అతిపెద్ద ఎల్పీజీ ట్యాంకర్లు ఈ కీలక జలమార్గాన్ని సురక్షితంగా దాటాయి. దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో వస్తున్న ఈ నౌకలకు భారత నౌకాదళం భద్రత కల్పిస్తుండగా, మరో రెండు రోజుల్లో ఇవి ముంబై లేదా కాండ్లా పోర్టుకు చేరుకోనున్నాయి. ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS) ఈ నౌకల ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.


ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మొత్తం 28 భారత నౌకలు ఉండగా, వాటిలో 778 మంది భారత సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధిపై నెలకొన్న అనిశ్చితిని భారత్ తన దౌత్య చతురతతో అధిగమించడం విశేషం. ఇప్పటికే ఉన్న 2.15 లక్షల టన్నుల ఎల్ఎన్‌జీ, 17.5 లక్షల టన్నుల ముడి చమురు నిల్వలతో మరిన్ని ట్యాంకర్లు ఈ మార్గం ద్వారా భారత్‌కు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ కూడా భారత్-ఇరాన్ స్నేహ సంబంధాల దృష్ట్యా ఈ రవాణాకు పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

Read aloso: హైదరాబాద్‌లో గ్యాస్ కొరత.. హోటల్స్ బంద్





