మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి తన భద్రత పెంచాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, వైసీపీ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపాడు. గతంలో తనకు కేటాయించిన భద్రతను తగ్గించారని, దాన్ని పునరుద్ధరించాలని కోరాడు.
దస్తగిరి తన వినతిపత్రంలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. కడప జైలులో డాక్టర్ చైతన్యరెడ్డి తనను బెదిరించాడని, ఈ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పటికీ తనకు సరైన రక్షణ లభించలేదని వాపోయాడు. సాక్షుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని, కొత్త ప్రభుత్వం తనకు రక్షణ కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
ఇదిలా ఉండగా, వివేకా హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఆరుగురు కీలక సాక్షులు అనుమానాస్పదంగా మరణించారని, వీరి మరణాల వెనుక గల కారణాలను నిగ్గు తేల్చాలని SIT బృందానికి ఆదేశాలు ఇచ్చారు.
SIT బృందంలో జమ్మలమడుగు, పులివెందుల డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లు, ఫోరెన్సిక్, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఇప్పటికే SIT బృందం క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించింది. రంగన్న అనే వాచ్‌మెన్ మృతి కేసు సహా గత ఆరేళ్లలో జరిగిన మరణాలపై లోతుగా విచారణ జరుపనుంది.