ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. దీని ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 7.45 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు కొనసాగుతాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఒంటిపూట బడులు ఉన్నప్పటికీ, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తరగతులు ముగిసిన వెంటనే విద్యార్థులకు పౌష్టికాహారం అందించి ఇంటికి పంపేలా ఏర్పాట్లు చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.





