హైదరాబాద్/ఫుకెట్: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జరిగిన సాంకేతిక లోపం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. అదృష్టవశాత్తూ విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఏం జరిగింది? (Hard Landing)
బుధవారం ఉదయం 133 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బోయింగ్ 737 మ్యాక్స్8 విమానం, థాయ్‌లాండ్ కాలమానం ప్రకారం ఉదయం 11:40 గంటలకు ఫుకెట్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే, రన్‌వేపై దిగే క్రమంలో విమానం అత్యంత వేగంతో, బలంగా నేలను ఢీకొట్టింది (Hard Landing). ఈ ధాటికి విమానం ముందు భాగంలో ఉండే చక్రం (Nose Gear) తీవ్రంగా దెబ్బతిన్నది.
రన్‌వేపై జారిపోయిన విమానం
నోస్ ల్యాండింగ్ గేర్ విరిగిపోవడంతో నియంత్రణ కోల్పోయిన విమానం రన్‌వేపై కొంతదూరం జారిపోయింది. ఈ హఠాత్పరిణామంతో విమానాశ్రయ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులందరినీ అత్యవసర ద్వారాల ద్వారా సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిలిచిపోయిన విమాన రాకపోకలు
ఈ ప్రమాదం కారణంగా రన్‌వేపై విమానం నిలిచిపోవడంతో, ఫుకెట్ విమానాశ్రయ అధికారులు వెంటనే ‘నోటమ్’ (NOTAM – Notice to Air Mission) జారీ చేశారు. రన్‌వేను తాత్కాలికంగా మూసివేసి, ఇతర విమాన రాకపోకలను దారి మళ్లించారు. దెబ్బతిన్న విమానాన్ని రన్‌వే నుంచి తొలగించే పనులు యుద్ధప్రతిపాదికన కొనసాగుతున్నాయి.
సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ‘హార్డ్ ల్యాండింగ్’ జరిగిందా అనే కోణంలో విమానయాన సంస్థ దర్యాప్తు చేపట్టింది.





