Duleep Trophy: బ్యాట్‌తో సంచలనాలు సృష్టించే వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi ).. ఇప్పుడు బంతితోనూ తన సత్తా చాటుతున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ ఆటగాడు దులీప్ ట్రోఫీలో ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించాడు. ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు పతనాన్ని వేగవంతం చేశాడు. మ్యాచ్‌లో తొలుత నార్త్ ఈస్ట్ జోన్ 111 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఈస్ట్ జోన్ బ్యాటర్లు చెలరేగడంతో 467 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో నార్త్ ఈస్ట్ జోన్ ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ జట్టు బ్యాటింగ్ తడబడగా, వైభవ్ తన స్పిన్ మాయాజాలంతో ఒత్తిడి మరింత పెంచాడు.
ఎడమచేతి వాటం స్లో ఆర్థడాక్స్ స్పిన్నర్ అయిన వైభవ్ 27వ ఓవర్‌లో బంతిని అందుకున్నాడు. ఓవర్ రెండో బంతికే కిషన్ లింగ్డోను 25 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ఆ తర్వాత ఐదో బంతికి ఇమ్లివాటి లెమ్టూర్‌ను పెవిలియన్‌కు పంపి ఒకే ఓవర్‌లో రెండో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా మూడు ఓవర్లు వేసిన వైభవ్ కేవలం 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. అయితే బ్యాటర్‌గా మాత్రం ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో ఈస్ట్ జోన్ మ్యాచ్‌పై పట్టు బిగించింది.
