Fastag: దేశవ్యాప్తంగా హైవేలను వినియోగించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఇకపై టోల్ ఫీజులను కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ తగ్గడంతో పాటు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 98 శాతం టోల్ లావాదేవీలు ఇప్పటికే ఫాస్టాగ్ ద్వారా జరుగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.
ఇప్పటివరకు ఫాస్టాగ్ లేని వాహనదారులు నగదు రూపంలో రెట్టింపు టోల్ చెల్లించి వెళ్లే అవకాశం ఉండేది. అలాగే కొన్ని సందర్భాల్లో యూపీఐ చెల్లింపులకు 1.25 రెట్లు టోల్ వసూలు చేసే విధానం అమల్లో ఉంది.
అయితే తాజా మార్పుల ప్రకారం నగదు చెల్లింపులకు పూర్తిగా చెక్ పెట్టి, 100 శాతం డిజిటల్ టోల్ సిస్టమ్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టోల్ లేన్లలో క్యాష్ వల్లే ఎక్కువగా జాప్యం, క్యూలు, వివాదాలు తలెత్తుతున్నాయని NHAI భావిస్తోంది.
ఒకవేళ ఫాస్టాగ్ పని చేయకపోయినా లేదా బ్యాలెన్స్ లేకపోయినా, వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద అందుబాటులో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా తక్షణమే చెల్లింపులు చేయవచ్చు. అందువల్ల ప్రయాణానికి బయలుదేరే ముందు ఫాస్టాగ్ వాలెట్‌లో సరిపడా బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే తరచుగా హైవే ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్, రీఛార్జ్ సదుపాయాలపై కూడా ముందుగానే అవగాహన కలిగి ఉండటం మంచిదని చెబుతున్నారు.








