డార్క్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ కలయికలో రూపొందిన మలయాళ సినిమా ‘ప్రావింకూడు షాపు’ థియేటర్లలో మోస్తరిగా ఆడిన తర్వాత ఇప్పుడు ‘సోనీ లివ్’లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్ కీలక పాత్రల్లో నటించారు. ఒక అడవికి అతి దగ్గరలో ఉన్న గ్రామంలో జరిగిన హత్య ఘటన ఆధారంగా కథ నడుస్తుంది.
గ్రామంలో బాబు అనే వ్యక్తి కల్లు దుకాణం నడుపుతూ ఉంటాడు. ఓ రాత్రి పేకాట ఆడుతున్న 11 మందితో పాటు ఉండే బాబు, తెల్లవారేసరికి ఉరితాడులో కనిపిస్తాడు. ఈ ఘటన ఆత్మహత్యలా కనిపించినా, పోలీస్ ఆఫీసర్ సంతోష్ దీన్ని హత్యగా భావించి విచారణ ప్రారంభిస్తాడు. బాబులాంటి బలవంతుడిని చంపేందుకు ఒక్కరే సరిపోడని, మరికొంతమంది కూడా దీనికి పాల్పడ్డారని అనుమానిస్తాడు.
సంతోష్ దర్యాప్తులో సునీ, కన్నా లపై అనుమానం పెరుగుతుంది. వీరిలో మెరిండా అనే మహిళా పాత్ర కూడా బాబుతో ఏదో సంబంధం కలిగి ఉండవచ్చని భావించి ఆమెకూ దర్యాప్తులో స్థానం ఇస్తాడు. ఈ కేసుపై సంతోష్ ఎందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు? ఈ ముగ్గురిలో ఎవరు నిజంగా హంతకులా? అన్నదే కథలో సస్పెన్స్‌ను నడిపిస్తుంది.
ఈ సినిమా కథ కొత్తదేమీ కాకపోయినా, అడవిలోని కాలుష్య రహిత లొకేషన్లు .. ఫొటోగ్రఫీ .. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రాన్ని వేరొక స్థాయికి తీసుకెళ్లాయి. పాత్రల ఎంపిక కూడా కథకి మంచి బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ పాత్రలో కొద్దిపాటి కామెడీ టచ్, చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకపోవడంతో ఇది కుటుంబంతో చూడదగ్గ సినిమా.