Telangana Transport: తెలంగాణలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు టీజీఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణను వేగవంతం చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాణిగంజ్ డిపోలో 65 మెట్రో ఎక్స్‌ప్రెస్ EV బస్సులను ప్రారంభించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 810 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, హైదరాబాద్–సికింద్రాబాద్ నగరాల్లో 300 బస్సులు సేవలందిస్తున్నాయి. జనవరి చివరి నాటికి మరో 175 ఈవీ బస్సులు చేరడంతో నగరంలో మొత్తం 540 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి హైదరాబాద్‌లో కొత్తగా 373 కాలనీ రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు. ట్రాకింగ్ సిస్టమ్, విశాల సీటింగ్, ప్రత్యేక యాక్సెసిబిలిటీ, అగ్నినిరోధక వ్యవస్థ వంటి ఆధునిక సదుపాయాలతో ఈ బస్సులు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చేలా రూపొందించబడ్డాయి.
సికింద్రాబాద్–కొండాపూర్, ఇస్నాపూర్, బోరబండ, రామాయంపేట, గచ్చిబౌలి, మీడియాపూర్ ఎక్స్ రోడ్ వంటి కీలక మార్గాల్లో కొత్త EV బస్సులు నడవనున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవసరమైన చోట బస్సులను విస్తరించేలా స్థానిక ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించాలని మంత్రి సూచించారు. ఐటీ కారిడార్‌లో ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా ట్రాఫిక్ తగ్గుతుందని తెలిపారు.
రెండు సంవత్సరాల్లో 2,400 కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఉచిత ప్రయాణంలో ఇప్పటివరకు 251 కోట్ల జర్నీలు నమోదు అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.
