Telangana Municipal Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.
వీరిలో 25,62,369 మంది పురుషులు కాగా, 26,80,014 మంది మహిళలు ఉన్నారు. అదనంగా 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.
జిల్లాల వారీగా చూస్తే, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు నమోదయ్యారు. మరోవైపు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు.
ALSO READ:అక్రమ మైనింగ్ భీభత్సం.. కూలిన బొగ్గు గని….కార్మిక కుటుంబాల్లో ఆందోళన ?
మున్సిపాలిటీల్లో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉండగా, అమరచింత మున్సిపాలిటీలో కేవలం 9,147 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
ఇదిలా ఉండగా, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అధికార యంత్రాంగం సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది.
