వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద కొడంగల్ జనరల్ ఆసుపత్రి పేరుతో సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఫ్లెక్సీని గమనించిన స్థానికులు సిబ్బందిని నిలదీశారు. కానీ సిబ్బంది సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేసి, ఫ్లెక్సీని చించివేశారు.
తాండూరులో మూడు ప్రవేశ ద్వారాలు ఉండగా, ఒక ప్రవేశ ద్వారానికి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫ్లెక్సీ కొడంగల్ జనరల్ ఆసుపత్రి పేరు మీద పెట్టడం, ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి తప్పిదం కలగడం కేవలం ప్రజలకు తప్పుగా అర్థం కావడమే కాకుండా, స్థానికుల ఆందోళనకు కారణమైంది.
ఈ వివాదానికి సంబంధించి, వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు ప్రభుత్వం వైద్య కళాశాల మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొడంగల్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆధునికీకరిస్తున్నారు. త్వరలో ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్ బృందం కొడంగల్‌కు తనిఖీకి రానుంది. తమ నిబంధనలను అమలు చేయడం కోసం, కొడంగల్‌లోని 220 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైనా, పొరబాటున ఫ్లెక్సీ తాండూరులో పెట్టడమంతే.
ఈ వివాదంపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పందించారు. కాంట్రాక్టర్ తప్పిదం వల్ల ఈ పొరబాటు జరిగిందని చెప్పారు. తాను ఇప్పటికే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, ఫ్లెక్సీ తప్పుగా పెట్టిన వాస్తవానికి సంబంధించి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
