ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నడిచే ఈ రైలు (నంబర్లు 17439/17440) ఏప్రిల్ 13, 2026 నుంచి రెగ్యులర్ సర్వీస్‌గా అందుబాటులోకి రానుంది. ఈ సేవ ప్రారంభానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక పాత్ర పోషించారు.
ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి తిరుపతికి వెళ్లాలంటే మధ్యలో రైళ్లు మారాల్సిన ఇబ్బందులు ఉండేవి. ముఖ్యంగా విశాఖపట్నం వరకు వెళ్లి మరో రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ కొత్త సర్వీస్‌తో ఆ సమస్య పూర్తిగా తొలగిపోనుంది.
సమయాల ప్రకారం, తిరుపతి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 4:55 గంటలకు బయలుదేరే రైలు సోమవారం మధ్యాహ్నం 12:30కి శ్రీకాకుళం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8:10కి తిరుపతి చేరుతుంది.
ఈ హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉండనున్నాయి. మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను రూపొందించారు.
ఈ రైలు ప్రారంభంతో తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు, అలాగే దీర్ఘదూర ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం కలగనుంది. శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరిందని అధికారులు తెలిపారు.








