పెదగంట్యాడ గ్రామంలోని 75వ వార్డు, దుర్గవానిపాలెం ఎంపీపీ ఎస్సీ స్కూల్ 1981లో గ్రామస్తుల పోరాటంతో స్థాపించబడింది. అప్పటి నుంచి రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ, విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తోంది. ఈ స్కూల్ మంచి క్రమశిక్షణతో, శుభ్రతతో, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తోంది.
ప్రస్తుత పరిస్థితిలో స్కూల్‌లో డిజిటల్ క్లాస్‌రూమ్స్, మినరల్ వాటర్ ప్లాంట్, శుభ్రమైన టాయిలెట్స్, ఆధునిక వంటగది, రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం లాంటి అన్ని హంగులు ఉన్నాయి. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ, కేవలం 38 మంది విద్యార్థులు మాత్రమే ఈ స్కూల్లో చదువుతున్నారు. ఇది ఉపాధ్యాయులను, స్కూల్ యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పిల్లలు ఈ స్కూల్లో చేరేందుకు ప్రోత్సహించాలని, గ్రామస్తులు, తల్లిదండ్రులు ముందుకు రావాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ స్కూల్‌లో చదివిన అనేక మంది విద్యార్థులు మంచి స్థాయికి చేరుకున్నారని, పిల్లల భవిష్యత్తు మెరుగుపడేందుకు ఇది మంచి అవకాశం అని వారు పేర్కొన్నారు.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, గ్రామస్థులు, తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, సమీపంలోని పిల్లలను కూడా ఈ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ, స్కూల్ అభివృద్ధికి సహకరించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.