Red Wing Drone: ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో స్థానిక గిరిజనులు భయంతో ఉలిక్కిపడ్డారు. ఆకాశం నుంచి వింత ఆకారంలోని వస్తువు కుప్పకూలింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం బొయితిలి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో జరిగింది.
స్థానికులు మొదట హెలికాప్టర్ లేదా యుద్ధ విమానం అని అనుకున్నారు. పెద్ద శబ్దంతో డ్రాప్ అవ్వడంతో భయం మరింత పెరిగింది. కానీ తర్వాత ఇది వైద్య సేవల కోసం ఉపయోగించే భారీ డ్రోన్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
ప్రభుత్వం ‘రెడ్ వింగ్’ సంస్థతో కలిసి అత్యవసర వైద్య సేవలను దూర గ్రామాలకు వేగంగా అందించేందుకు డ్రోన్ సేవల ట్రయల్ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మందులు, అత్యవసర సరుకులు తక్షణం గ్రామాలకు చేరతాయని లక్ష్యం.
అయితే, ఈ ట్రయల్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా డ్రోన్ నియంత్రణ కోల్పోయి చెట్లపై పడిపోయింది. మినీ హెలికాప్టర్‌లా పెద్దగా ఉన్న డ్రోన్‌ని గిరిజనులు మొదట అయోమయంతో చూశారు.
పరిసర గ్రామాల ప్రజలు ప్రమాదం తెలిసిన వెంటనే చేరారు, కానీ జననష్టం జరగలేదు. స్థానికులు, ఈ డ్రోన్ ఇళ్లపై పడితే పెద్ద ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి కంపెనీ ప్రతినిధులు చేరి డ్రోన్ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక లోపమే కారణమని, ట్రయల్‌లో ఇలాంటి ఘటనలు సాధారణమని తెలిపారు. స్థానికులు, ఆధునిక సాంకేతికత ఉపయోగం మంచిది అయినప్పటికీ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.








