యోగా గురు బాబా రామ్‌దేవ్ చేసిన “షర్బత్ జిహాద్” వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ప్రముఖ శీతల పానీయం “రూహ్ అఫ్జా”ను లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. భోపాల్‌లోని టీటీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
తాను ఏ మతాన్ని గానీ, బ్రాండ్‌ను గానీ లక్ష్యంగా పెట్టలేదని బాబా రామ్‌దేవ్ సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగినట్లయితే, అది వారు తమపైే ఆరోపణగా తీసుకోవడం వల్లేనని చెప్పారు. వారు మదర్సాలు, మసీదులు నిర్మించుకోవడం ఫర్వాలేదని, అదే సమయంలో సనాతన ధర్మాన్ని అనుసరించేవారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
దిగ్విజయ్ సింగ్ మాత్రం రామ్‌దేవ్ వ్యాఖ్యలు మత విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇది విద్వేష ప్రసంగంగా పరిగణించాలంటూ కోరారు. పతంజలికి చెందిన గులాబ్ షర్బత్‌ను ప్రమోట్ చేయడానికే ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రూహ్ అఫ్జా అమ్మకాలు మతపరమైన కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయని చెబుతూ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.
రామ్‌దేవ్‌పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ఐటీ చట్టం, భారతీయ న్యాయసంహిత కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ఆధారంగా రామ్‌దేవ్ షేర్ చేసిన వీడియో క్లిప్‌ను కూడా ఫిర్యాదులో జత చేశారు. ఒక ఉత్పత్తి యజమాని ముస్లింగా ఉండటం మాత్రమే ఆధారంగా వ్యతిరేకించడాన్ని సమాజానికి హానికరమని వివరించారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు.








