మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ, కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి 419 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అందులో 304 సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
మిగిలిన 115 దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతున్నదని ఆమె తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను నేరుగా ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సూచించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, తమ సమస్యలను తీర్చుకోవడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.