ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ హత్య కేసు సంచలనంగా మారింది. తన ఆరేళ్ల కూతురు పుట్టినరోజు కోసం లండన్ నుంచి వచ్చిన సౌరభ్ భార్య ముస్తాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ కలిసి అతన్ని దారుణంగా హత్య చేశారు. సౌరభ్ శరీరాన్ని ముక్కలు చేసి, ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సమాధి చేశారు.
ఈ ఘోర ఘటనలో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకుండా ముస్తాన్ ప్రయత్నించింది. అయితే, సౌరభ్ ఆరేళ్ల కుమార్తె తన తండ్రిని తల్లి డ్రమ్ములో పెట్టడాన్ని గమనించింది. చుట్టుపక్కల వారు తండ్రి గురించి అడిగితే, నిర్లక్ష్యంగా ‘‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’’ అని చెప్పింది. మొదట అందరూ ఆ మాటను చిన్నపిల్ల మాటగా తీసుకున్నారు. కానీ, తర్వాత నిజం తెలుసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
సౌరభ్ తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ముస్తాన్, సాహిల్‌లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ముస్తాన్ తన భర్తను హత్య చేసి ప్రియుడితో కలిసి జీవించాలని ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.
సౌరభ్ తల్లి రేణు దేవి కన్నీటి పర్యంతమై, ప్రేమించి పెళ్లి చేసుకున్న కొడుకును ముస్తాన్ తొలుత తన కుటుంబం నుంచి దూరం చేసిందని, చివరకు హత్య చేసిందని వాపోయారు. ఆమెతో పాటు సాహిల్‌కి, దీనికి సహకరించిన వారందరికీ ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ముస్తాన్ తల్లిదండ్రులు సైతం తమ కూతురి చర్యను ఖండిస్తూ, ఆమెకు మన్నించరాని శిక్ష విధించాలని కోరుతున్నారు.