ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 23న తన పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులతో ఈ వేడుకలు నిర్వహించడంతో లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ పేర్కొన్నారు. విద్యార్థులతో తన బర్త్ డే వేడుకలు నిర్వహించారని వచ్చిన వార్తలు తనను మనస్థాపానికి గురి చేశాయని తెలిపారు.
దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను లోకేశ్ ఆదేశించారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థలు విద్యార్థుల అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడాలని సూచించారు.
లోకేశ్ ప్రకటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించారు. స్కూళ్లలో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు సమాచారం.