మంత్రి నారా లోకేశ్ మంగళవారం అసెంబ్లీలో నాడు-నేడు ప్రాజెక్టులపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద చేపట్టిన పనులను పూర్తిగా నిలిపివేశారని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికే రూ.4,789 కోట్లు ఖర్చు అవుతుందని లోకేశ్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
జీవో 117 విద్యార్థులను పాఠశాలలకు దూరం చేసే విధంగా ఉందని, అందుకే కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని లోకేశ్ తెలిపారు. పిల్లలు స్వేచ్ఛగా చదువుకునే హక్కును కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. విద్యను అందరికీ చేరువ చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రస్తుతం పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని లోకేశ్ వివరించారు. పాఠశాలలకు స్టార్ రేటింగ్స్ ఇవ్వడం ప్రారంభించామని, దీని ద్వారా విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు అందుబాటులోకి రాబోతున్నాయని అన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే లక్ష్యమని స్పష్టం చేశారు.