భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ క్రికెట్ అరంగేట్ర బ్యాటర్ సామ్ కొంస్టాస్ మరియు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య వివాదం చెలరేగింది. ఓవర్ పూర్తయ్యాక పిచ్‌పై నడిచి వెళ్ళిపోతున్న కొంస్టాస్‌ను అటుగా బంతి పట్టుకొని వస్తున్న కోహ్లీ భుజంతో బలంగా ఢీకొట్టారు, ఇది విమర్శలకు గురైంది.
ఈ ఘటన మొదటి రోజు చోటుచేసుకున్నా, కోహ్లీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసీస్ క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్, మైఖేల్ వాన్ వంటి వారు కూడా కోహ్లీని తప్పుబడుతున్నారు. ఐసీసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఐసీసీ రూల్‌బుక్‌లోని 2.12 నిబంధన కింద వస్తుందని పేర్కొనడం గమనార్హం.
ఐసీసీ రూల్ 2.12 ప్రకారం, అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆటగాడు, సహాయక సిబ్బంది, అంపైర్ లేదా ఇతర వ్యక్తులను అనుచితంగా శరీరాన్ని తాకడం నిషేధించబడింది. ఈ చర్య ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా జరిగిందా అనే దానిపై ఐసీసీ విచారణ జరిపి, చర్య తీసుకుంటుంది.
ఐసీసీ రూల్‌బుక్ ప్రకారం, ఈ ప్రవర్తనను లెవల్-2 నేరంగా పరిగణిస్తే కోహ్లీకి 3-4 డీమెరిట్ పాయింట్లు లభిస్తాయి, తదుపరి మ్యాచ్‌లో ఆడకుండా నిషేధం విధించబడే అవకాశముంది. అయితే, ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఈ వ్యవహారంలో తుది నిర్ణయం తీసుకుంటారు.