Indian Stock Market: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ సంకేతాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా క్షీణించడం దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ ఊపునిచ్చాయి. దీంతో బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దూసుకెళ్లి పెట్టుబడిదారులకు భారీ లాభాలు అందించాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,946.32 పాయింట్లు ఎగిసి 77,562.90 వద్ద, నిఫ్టీ 873.70 పాయింట్లు పెరిగి 23,995.45 వద్ద స్థిరపడింది. ఒక దశలో నిఫ్టీ 24 వేల మార్క్‌ను తాకడం గమనార్హం.
ఈ జోరుతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.15 లక్షల కోట్లు పెరిగి రూ.445 లక్షల కోట్లకు చేరుకుంది.
ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, చమురు ధరల తగ్గుదల, రూపాయి బలపడటం వంటి అంశాలు ఈ ర్యాలీకి బలంగా పనిచేశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92.59 వద్ద నమోదవడం కూడా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది.
సెన్సెక్స్‌లోని 30 ప్రధాన కంపెనీల్లో టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ మినహా మిగిలిన షేర్లు ఎక్కువగా లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇండిగో, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ వంటి షేర్లు 5 నుంచి 8 శాతం వరకు పెరిగాయి.
ఇక అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 94 డాలర్ల పరిధిలో ఉండటం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గే అవకాశాలపై వచ్చిన అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆసియా మార్కెట్లు, అమెరికా సూచీలు కూడా లాభాల్లో ముగియడం దేశీయ సూచీలకు అదనపు బలం ఇచ్చింది.








