అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపుతోంది. లూసియానాలో 65 ఏళ్ల వృద్దుడు డిసెంబరు నెలలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడు. శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రికి వెళ్లిన ఈ వ్యక్తికి వైద్యులు బర్డ్ ఫ్లూ H5N1 సోకినట్టు నిర్ధారించారు. అమెరికాలో ఇది మొదటి సీరియస్ బర్డ్ ఫ్లూ మరణంగా చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ సాధారణంగా పక్షులు, కోళ్లు, జంతువుల్లో మాత్రమే కనిపించేది. అయితే, ఈసారి తొలిసారిగా మనుషుల్లోనూ ఈ వైరస్ ప్రభావం చూపుతోంది. వైరస్ సోకిన వ్యక్తి పెరట్లో అడవి పక్షుల సమీపంలో ఎక్కువగా ఉండడం వల్లే ఇన్ఫెక్షన్ వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. మరొకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు.
వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 66 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. చలికాలం కారణంగా వైరస్ మరింత ప్రమాదకరంగా మారినట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ విజృంభిస్తుండగా, బర్డ్ ఫ్లూ అమెరికాలో కలకలం రేపుతోంది. వైరస్‌ల వ్యాప్తి మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని మళ్లీ గుర్తుచేస్తోంది. ఆరోగ్య నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.