గుర్లలో డయేరియా వ్యాధి తగ్గుమఖం పట్టిందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఆయన గుర్ల గ్రామంలో శుక్రవారం పర్యటించారు. పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, పైప్‌లైన్లను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సెప్టెక్‌ట్యాంకులనుంచి వచ్చే వ్యర్ధాలు కాలువల్లో కలవకుండా చూడాలని, భూగర్భ జలాలు, త్రాగునీరు ఎక్కడా కలుషితం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చికిత్స పొందుతున్న రోగుల యోగక్షేమాలను విచారించారు. స్థానిక ఎంఈఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డయేరియా అదుపు చేసేందుకు తీసుకున్న చర్యలు, పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, వైద్య సదుపాయాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, గ్రామంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు. శుక్రవారం కొత్తగా ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. వారికి మెరుగైన చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు సంభవించిన మరణాల్లో కేవలం ఒక్కరు మాత్రమే డయేరియా కారణంగా మరణించారని, మిగిలినవారు ఇతర అనారోగ్య కారణాలతో మృతి చెందారని తెలిపారు. వైద్యారోగ్యం, గ్రామీణ నీటి సరఫరా, పంచాయితీ శాఖలు సమన్వయంతో పనులు చేస్తున్నారని చెప్పారు. భూగర్భ జలాలు కలుషితం అవ్వడం వల్లే గ్రామంలో డయేరియా వ్యాధి ప్రభలిందని తేలినట్లు చెప్పారు. గ్రామంలో మొత్తం 277 బోర్లు ఉన్నాయని, అక్కడ కేవలం 15 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉండటం, బోరు నీరు కలుషితం అవ్వడం వల్లే ఈ వ్యాధి
సోకిందని వెళ్లడించారు. బోరునీటిని వినియోగించకుండా చర్యలు తీసుకున్నామని, గత ఐదు రోజులనుంచీ నాగావళి త్రాగునీటి పథకం నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని వివరించారు.
ఈ పర్యటనలో మెడికల్ హెల్త్ డైరెక్టర్ పద్మావతి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.భాస్కర్రావు, పంచాయితీ అధికారి టి.వెంకటేశ్వర్రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.ఉమాశంకర్, పంచాయితీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాస్, జెడ్‌పి సిఇఓ బివి సత్యనారాయణ, ఆర్‌డిఓ బి.సత్యవాణి, తాసిల్దార్ ఆదిలక్ష్మి, ఎంపిడిఓ శేషుబాబు, ఎంఈఓ భానుప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.