బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో సిల్వర్ జుబ్లీ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్‌నేనని స్పష్టంచేశారు. పార్టీ స్థాపన నుంచి ప్రజల మద్దతుతో ముందుకు సాగిందని గుర్తు చేశారు.
ఎల్కతుర్తిలోని 1,200 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ వివరించారు. మూడు వేల బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీని కోరినట్టు తెలిపారు. ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చరిత్రలో ఇదే అతిపెద్ద బహిరంగ సభగా నిలవనుందని చెప్పారు. ఈ సభ ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు.
బహిరంగ సభ ముగిసిన వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు అనంతరం పార్టీ అధ్యక్షుడి ఎన్నికను నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను కూడా తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాల వారీగా శిక్షణా శిబిరాలు కూడా చేపడతామని వివరించారు.
ప్రతి నెల ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతిని పొందుతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను కేసుల్లో ఇరికించడమే రేవంత్ రెడ్డి ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. విద్యార్థుల ఉద్యమాలను గౌరవించాలని కోరారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని మల్లు భట్టీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు.