అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దేవి-భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు స్వస్తిక్, వేణుగోపాల శర్మ, నేరెళ్ల కళ్యాణ్ వేద మంత్రోచ్ఛారణల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు.
కళ్యాణ మహోత్సవంలో వరుడు తరపున బరంపూర్ వాస్తవ్యులు మెరుగు మోహన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వధువు తరపున మైస సురేష్ దంపతులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించారు.
భక్తులకు బరంపూర్ గ్రామస్థులు మాడూరి పరివారం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేణుగోపాల శర్మ మాట్లాడుతూ, త్రాయణిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం అనంతరం మహా సుదర్శన యాగం, ప్రత్యేక అభిషేకం, రథోత్సవం, లడ్డూ వేలం నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.
ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కేదారేశ్వర్ రెడ్డి, తలమడుగు సహకార సంఘం చైర్మన్ దామోదర్ రెడ్డి, కోశాధికారి భరకం మల్లేష్, నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, మెరుగు మోహన్ రెడ్డి, మాడూరి మల్లేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల సంతోషం మధ్య కళ్యాణ మహోత్సవం విజయవంతంగా ముగిసింది.