కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం లంబడిగూడ గ్రామపంచాయతీ కార్యదర్శి మడిశెట్టి శ్రీనివాస్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇల్లు నిర్మించాలంటే రూ. 30,000 నుంచి 40,000 వరకు వసూలు చేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. అధికారుల అండదండలతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.
గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించాల్సిన శ్రీనివాస్, తన హోదాను దుర్వినియోగం చేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. ఇటీవల ఓ బాధితుడిని ఫోన్ చేసి బెదిరించాడని, ప్రజలు బడ్జెట్ లేదా పంచాయతీకి సంబంధించిన విషయాలు అడిగితే వారిని భయపెడుతున్నాడని తెలిపారు. ప్రజల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయన దోపిడీ మరింత పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తులు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి వద్ద ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఫిర్యాదులు చేసిన వారిపై శ్రీనివాస్ కక్ష కట్టి సోషల్ మీడియాలో వారి మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్నాడని ఆరోపించారు. గ్రామ అభివృద్ధికి గ్రామ కార్యదర్శి బాధ్యతగా ఉండాల్సిన సమయంలో, ఇలాంటి అక్రమాలకు పాల్పడటం శోచనీయమని అన్నారు.
ఇటువంటి అక్రమాలకు పాల్పడే గ్రామ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకొని, విధుల నుంచి తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించాల్సిన వ్యక్తి ఇలా వ్యవహరించడం తగదని, ప్రజలను బెదిరించి అక్రమంగా వసూళ్లు చేయడాన్ని తక్షణమే ఆపాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.