నెల్లూరులోని రంగనాయకులపేట యాదవవీధిలో వెలసి భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న శ్రీ మహాలక్ష్మిదేవి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి కుటుంబసమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి దంపతులకు ఆలయ నిర్వాహకులు, స్థానిక టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి నారాయణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి… మహిషాసురమర్థిని అలంకరణలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంత్రి నారాయణ, రమాదేవి దంపతులను అక్కడి వారు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో పోటోలు తీసుకునేందుకు ముందుకొచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ రంగనాయకులపేట యాదవవీధిలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కుటుంబసమేతంగా విచ్చేసి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు నిర్వహించుకుంటారని చెప్పారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ విజయదశమి ప్రజలందరికీ సుఖసంతోషాలు ప్రసాదించాలని మంత్రి నారాయణ, రమాదేవి దంపతులు కోరుకున్నారు.
రంగనాయకులపేటలో మంత్రి నారాయణ దంపతుల సందర్శన
