Home National Bombay High Court | తెహెల్కా మాజీ ఎడిటర్‌కు 10 ఏళ్ల జైలు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Bombay High Court | తెహెల్కా మాజీ ఎడిటర్‌కు 10 ఏళ్ల జైలు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

0
Bombay High Court | తెహెల్కా మాజీ ఎడిటర్‌కు 10 ఏళ్ల జైలు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Bombay High Court: దాదాపు 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన గోవా అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును పక్కనపెట్టి, కేసులో సమర్పించిన ఆధారాలు నేరాన్ని స్పష్టంగా రుజువు చేస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. ఆయన దోషి అని నిర్ధారించిన న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. అలాగే రెండు వారాల్లోగా సంబంధిత జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.

2013లో గోవాలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా తన సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో తరుణ్ తేజ్‌పాల్‌పై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అదే ఏడాది నవంబరులో ఆయనను అరెస్ట్ చేయగా, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో 2021లో ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాలు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు కేసులోని ఆధారాలను పరిశీలించి నేరం రుజువైందని పేర్కొంది. తీర్పు వెలువడే సమయంలో తన వయస్సు 62 సంవత్సరాలని, భార్య ఒంటరిగా జీవిస్తోందని మానవత్వ దృక్పథంతో ఉపశమనం ఇవ్వాలని తరుణ్ తేజ్‌పాల్ విజ్ఞప్తి చేసినప్పటికీ, కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది.