ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra) సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుని భక్తుల్లో విషాదాన్ని నింపింది. రథయాత్రను వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో రద్దీ అదుపుతప్పి తొక్కిసలాట ఏర్పడింది. ఈ ఘటనలో కటక్‌కు చెందిన అనిల్ దాస్ అనే భక్తుడు మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు. మరో 120 మందికిపైగా భక్తులు గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రథయాత్ర మార్గంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించారు. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రథయాత్ర ప్రాంతంలో భక్తులు ప్రశాంతంగా ఉండాలని, పోలీసులు సూచిస్తున్న మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనతో జగన్నాథ రథయాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి.








